నమ్మించేవాడు నాయకుడు కాదు, నడిపించేవాడు నాయకుడు.. గెలిచేవాడు నాయకుడు కాదు గెలిపించేవాడు నాయకుడు.. ఈ డైలాగ్ 'గోపాల గోపాల' సినిమాలో శ్రీ కృష్ణుడికి సంబంధించింది. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు.. కృష్ణుడి నాయకత్వంలోని గొపుతనాన్ని తెలియజేసే మాటలు.
కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఆయుధం పట్టడు, యుద్ధం చేయడు. కానీ దగ్గరుండి పాండవులను గెలిపిస్తాడు. ఎప్పటికప్పుడు ఎత్తులు వేస్తూ, ఒక పద్ధతి ప్రకారం వాళ్లను నడిపిస్తూ వ్యూహకర్తగా వ్యవహరిస్తాడు.
ఏదీ... అనుకున్నంత సులభం కాదు ... ప్రతి నిమిషం కష్టపడాల్సిందే. ఆలోచన, ఆచరణ రెండూ ముఖ్యమే. ఈ రెంటినీ సరిగా నిర్వహిస్తేనే విజయం సాధ్యమవుతుంది. విజయం సాధించే వరకు పోరాటం తప్పుదు. చదువు, ఉద్యోగం, సంపాదన... ఏదైనా సరే. అసలు జీవితమే ఒక పెద్ద యుద్ధం లాంటిది. బతకడం కోసం ప్రతి నిమిషం పోరాడాల్సిందే.
తప్పు తెలియజేయాలి
మహాభారతంలో కృష్ణుడు కౌరవసభకు రాయబారిగా వెళ్తాడు. కౌరవులు, పాండవులు మధ్య సంధి కుదర్చాలని ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడితో దుర్యోధనుడిని ఒప్పించి పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని ఇప్పించమని అడుగుతాడు. దుర్యోధనుడు ఒప్పుకోడు. రాయబారి అయిన కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నిస్తాడు. కృష్ణుడు తప్పించుకుని వచ్చేస్తాడు.
కానీ, రాయబారం వల్ల యుద్ధం చేయడం పాండవులకు ఇష్టం లేదు. కౌరవులే న్యాయబద్ధంగా వాళ్లకు రావాల్సిన రాజ్యాన్ని ఇవ్వలేదు అని అందరికీ తెలిసేలా చేశాడు కృష్ణుడు . యుద్ధం వల్ల ఆస్తినష్టం ప్రాణనష్టం జరుగుతుంది. ధర్మరాజుకు చెడ్డపేరు కాకూడదు. అలా వస్తే యుద్ధం తర్వాత అతడి మీద ప్రజలకు వ్యతిరేకత రావచ్చు. అందుకే సభలో యుద్ధం వారించడానికి ప్రయత్నిస్తున్నట్లు మాట్లాడాడు.
ఇది కృష్ణుడి తెలివితేటలకు లోక రీతికి ఉదాహరణ. కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇతరులు తప్పుపడతారని భావిస్తే ఎందుకు చేస్తున్నామో చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందుగా అందరికి తెలియజేయాలి. అందువల్ల ఇతరుల సానుభూతి లభిస్తుంది. సాయం దొరుకుతుంది.. మంచి వాళ్లన్న పేరు మిగులుతుంది. రాయబారంతో కృష్ణుడు సాధించింది ఇదే....!
పని చేయించాలి
నాయకుడు ఎప్పుడూ యుద్ధం చేయాలనేం లేరు. అవసరాన్ని గుర్తించి సలహాలివ్వొచ్చు. కీలకమైన వ్యక్తిగా మాత్రమే వ్యవహరించవచ్చు. మహాభారతంలో కృష్ణుడు ఇదే చేశాడు. తాను నాయకుడిగా ఉండలేదు. ధర్మరాజును నాయకుడిగా నిలబెట్టాడు.
యుద్ధంలో ఎటువైపు? అని అడగడానికి వచ్చిన దుర్యోధనుడు, అర్జునులతో నేను యుద్ధం చేయను. ఆయుధం ముట్టను' అని ముందే పక్కకు తప్పుకున్నాడు. పైగా తను ఒక్కడు ఒక పక్షం. తన సైన్యం మొత్తం ఒక పక్షం అంటాడు. దాంతో దుర్యోధనుడు అతడి సైన్యాన్ని కోరుకుంటాడు. అర్జునుడు యుద్ధం చేయకపోయినా మా పక్షం ఉండమంటాడు.
అలా కృష్ణుడు అర్జునుడికి రథసారధిగా వ్యవహరిస్తాడు. కానీ యుద్ధం మొత్తం అతడి కనుసన్నల్లోనే జరుగుతుంది. ప్రతి నిముషం అప్రమత్తంగా ఉండి పాండవులు గెలవడానికి అవసరమైన సాయం చేస్తారు.
కర్తవ్యబోధన..
భగవద్గీతను ఎక్కువమంది జీవితసారాన్ని బోధించే గ్రంథంగా భావిస్తారు. కానీ ఒక పనిని మొదలు పెట్టేముందు... 'చెయ్యాలా, వద్దా?" అనే సందిగ్ధత ఏర్పడి నప్పుడు కర్తవ్యాన్ని బోధిస్తుంది గీత. ఎలా అంటే కౌరవులు, పాండవులు వారివారి సైన్యంతో యుద్ధ భూమికి చేరతారు. అర్జునుడు వాళ్లందరినీ చూసి 'యుద్ధం చేయను. నా వాళ్లను నా చేతులతో నేను చంపలేను' అని కర్తవ్యాన్ని నిర్వహించడానికి వెనకాడుతాడు.
అప్పుడు కృష్ణుడు అర్జునుడ్ని మానసికంగా యుద్ధానికి సిద్ధం చేస్తాడు. బాధ్యతల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుకోకూడదని చెప్తాడు. అలాగే ఎప్పుడు ఏ పనులు చేయాలో, ఎవరికోసం కష్టపడాలో, ఎలాంటి పనులు చేయాలో వివరిస్తాడు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను తాము సక్రమంగా నిర్వహించడమే జీవితం. ధర్మం, నీతి, న్యాయం, విలువలతో జీవిస్తూ, కర్తవ్యాన్ని నిర్వహించాలంటాడు కృష్ణుడు. కర్తవ్యం నుంచి తప్పుకునే వాళ్లకు జీవించే హక్కులేదని
బోధిస్తాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగా, వృత్తిపరంగా సమాజపరంగా.. అన్నీ బాధ్యతలను నిర్వర్తించాలి. ఎంచుకున్న రంగం ఏదైనా ముందుకు వెళ్లాలంటే బాధ్యతాయుతంగా పనిచేయాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.
బలాబలాలు
చాలామంది విజయం సాధించడానికి శత్రువులకంటే ఎక్కువ మంది ఉంటే చాలనుకుంటారు. కానీ శత్రువుల బలాన్ని మించి పోరాడే శక్తి ఉండాలి. కౌరవుల సైన్యం పెద్దది. పదకొండు అక్షౌహిణిలు, పాండవుల సైన్యం తక్కువ. ఏడు అక్షౌహిణులే కౌరవుల్లో భీష్ముడు.. కర్ణుడు .. ద్రోణుడు లాంటి గొప్ప గొప్ప వీరులున్నారు. జయించడం అంత సులభం కాదు.
పాండవుల వైపు ఐదురుగు అన్నదమ్ములే ప్రధానం. కృష్ణుడు ఉన్నా యుద్ధం చేయనని ముందే చెప్పాడు. అయినా చివరకు యుద్ధంలో పాండవులే గెలిచారు. దాని వెనుక కృష్ణుడి పాత్ర చాలా ఉంది. అతడి వ్యూహం ఉంది.
కురుక్షేత్ర యుద్ధానికి ముందే వాళ్ల ప్రధాన బలమైన జరాసంధుడిని భీముడితో చంపించాడు. యుద్ధంలో కూడా ఎప్పటికప్పుడు అర్జునిడికి సారథిగా ఉంటూ మాటసాయం చేశాడు. ఎప్పుడు ఎవర్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తూ, ప్రత్యుర్థులు బలాలను దెబ్బతీసేలా చేశాడు. ప్రధానంగా వ్యూహకర్తకు ఉండాల్సిన లక్షణాలివి.
ఒక పనిని నిర్వహించేటప్పుడు 'ఎవరి శక్తిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఎవరు ఏ పని బాగా చేయగలరు? తప్పులు జరిగితే ఎలా వాటిని సరిదిద్దుకోవాలి? కొత్తవాటిని ఎలా నేర్చుకోవాలి?" ఇలాంటివన్నీ తెలియాలి. అలాగే పోటీలో పాల్గొనేటప్పుడు ప్రత్యుర్థులపై గెలవాలంటే వాళ్ల బలం, బలహీనత రెండూ కచ్చితంగా అంచనా వేయాలి. ఓడించే నైపుణ్యం ఉండాలి. ఎప్పటికప్పుడు వ్యూహాల్ని కొత్తగా రచించే తెలివితేటలు కావాలి. క్రికెట్లో కెప్టెన్ లా వ్యవహరించాలన్నమాట. యుద్ధంలో కృష్ణుడు అదే చేశాడు. పాండవులను గెలిపించాడు..
వ్యూహాలు
యుద్ధం మైండ్ గేమ్ లాంటిది. యుద్ధమే కాదు ఏ పనైనా మైండ్ గేమే. అవసరం కొద్దీ ఎప్పటికప్పుడు వ్యూహాలు, ఎత్తుగడలు మార్చుకుంటూ ఉండాలి. శత్రువుల్లో బలవంతుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అంటే, చేసే పనిలో కీలకమైన అంశంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నమాట. కృష్ణుడు అదే చేశాడు.
కౌరవుల్లో ఎక్కువ బలవంతులు భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు అందుకే వాళ్ల మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. భీష్ముడి చేతిలో ఆయుధాలు ఉన్నంతసేపు ఎవరూ అతడిని జయించలేకపోతారు. కృష్ణుడి సలహా ప్రకారం పాండవులు భీష్ముడి దగ్గరకు వెళ్లి, అతడిని ఎలా గెలవాలో తెలుసుకుంటారు. తర్వాతే శిఖండి సాయంతో భీష్ముడిని జయిస్తారు.
అలాగే ద్రోణుడిని అశ్వత్థామ చనిపోయాడనే నిజం లాంటి అబద్ధంతో ఓడిస్తారు. కర్ణుడి విషయానికి వస్తే, శత్రు శిబిరంలో తమ వ్యక్తిని నియమించి, అతడి సాయం తీసుకుని కర్ణుడిని వధించేలా చేశాడు కృష్ణుడు. అందుకు శల్యుడిని పావులా వాడుకున్నాడు. యుద్ధంలో శల్యుడి మాటలు కర్ణుడిని బాగా కుంగదీస్తాయి. ఏకాగ్రత లేకుండా చేస్తాయి.
అంతకు ముందే కుంతీదేవిని కర్ణుడి దగ్గరకు పంపి అర్జునుడి తప్ప, మిగిలిన వాళ్ల జోలికి వెళ్లనని అతడి చేత మాట ఇప్పించుకునేలా చేస్తాడు. అన్ని విధాలా కర్ణుడిని నిర్వీర్యం చేసి అర్జునుడితో చంపిస్తాడు. ఒక కార్యాన్ని పూర్తి చేయడం, పోటీలో గెలవడం. విజయం సాధించడం.. లాంటి వన్నీ యుద్ధం లాంటివే.
కృష్ణుడు చేసినట్లు ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సి రావచ్చు. ముందుగా అనుకున్న ప్లాన్ విఫలం అయితే మరో ప్లాన్ ఆలోచించాలి. సమస్య ఎదురైతే కొత్త మార్గాన్ని ఆలోచించాలి. చివర్లో దుర్యోధనుడు నీళ్లలో దాక్కుని బయటకు రానప్పుడు అతడిని రప్పించడంలో. భీముడిచేత చంపించడంలో కృష్ణుడు కీలకంగానే వ్యవహరిస్తాడు.
టీమ్ లీడర్ అనే కాన్సెప్ట్నకు కచ్చితంగా కృష్ణుడు సరిపోతాడు. పాండవుల టీమ్ కు ధర్మరాజు లీడర్ అనిపించినా, పద్దెనిమిది రోజులు పాటు జరిగిన యుద్ధంలో మాత్రం కచ్చితంగా లీడర్ కృష్ణుడే. పాండవులను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడటమే కాకుండా, శత్రువులను ఎలా చంపాలో మార్గదర్శనం చేసింది కృష్ణుడే.
అందుకే ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే నాయకులుగా ఉన్నవాళ్లు తాము చేయడంతోపాటు, ఇతరులతో చేయించడం కూడా ముఖ్యమే. ఆటలో కూడా కెప్టెన్ ఆడలేకపోయినా... టీమ్ గెలిచేందుకు అవసరమైన విధంగా ఆటగాళ్లతో ఆడించాలి.

